
హర్యానాలో ఏడు గ్యారెంటీల వ్యూహంతో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. 10 గ్యారెంటీలంటూ హిమాచల్‌ను దివాలా తీసేలా చేసి, 5 గ్యారెంటీల పేరిట కర్ణాటకను అథోగతి పాల్జేసి, 6 గ్యారెంటీలంటూ తెలంగాణను నిండాముంచిన కాంగ్రెస్ చేష్టలను హర్యానా ఓటర్లు చెక్ పెట్టారు. హర్యానా పీఠం కాంగ్రెస్‌దే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఢంకా భజాయించి చెప్పినా, పోస్టల్ ఓట్ల లెక్కింపుతో తామే గెలుస్తున్నట్లు మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, హర్యానాలో మెజారిటీ మార్క్‌కు ఆమడ దూరంలో కాంగ్రెస్ ను నిలబెట్టారు.
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ సారి కాంగ్రెస్‌కే ఓటరు పట్టం కడతాడంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను వెలువరించాయి. అయితే, మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఓటరు వినూత్నమైన తీర్పునిచ్చా డు. 7 గ్యారెంటీలతో ఆకట్టుకోవాలనుకొన్న హస్తానికి రిక్తహస్తం ఇచ్చాడు.
90 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ను 37 స్థానాలకే పరిమితం చేశాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 మ్యాజిక్ ఫిగర్‌కు 9 సీట్ల దూరంలో హస్తాన్ని నిలువరించాడు. దేశం అంతటా నరేంద్ర మోదీ ప్రభంజనంతో 2014, 2019 ఎన్నికల సమయంలో కన్నా బిజెపి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
రాష్ట్ర బడ్జెట్ పరిమితి కూడా పట్టించుకోకుండా మ్యానిఫెస్టోలో 7 గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను కాంగ్రెస్ కురిపించింది. మహిళలకు నెలకు రూ. 2 వేలు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ. 6 వేలు, రూ. 500కు ఎల్పీజీ, రూ. 25 లక్షల ఉచిత వైద్యం, 100 గజాల స్థలంతో ఇండ్లు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, కులగణన, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎమ్మెస్పీకి చట్టబద్ధత వంటి హామీలిచ్చింది.
ఇవన్నీ అమలు చేయాలంటే రూ. 1.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్లో ఏటా ఏకంగా రూ. 70 వేల కోట్లు (బడ్జెట్లో 37 శాతం) అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. హామీలకే ఇంత కేటాయింపులు పోతే, అభివృద్ధి, పాలన, సంక్షేమం మాటేమిటని విమర్శలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ముందుకే వెళ్లింది.
కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో హిమాచల్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచుకు చేరింది. చివరకు పింఛనర్ల సంక్షేమ నిధి నుంచి నిధులను తీసుకొనే స్థాయికి దిగజారింది. గ్యారెంటీలకు, రాయితీలకు కోత పెట్టింది. కర్ణాటకలో 5 గ్యారెంటీల అమలుకు పెట్రోల్, డీజిల్ ధరలను సర్కారు అమాంతం పెంచింది. సేల్స్‌ట్యాక్స్ పేరిట వడ్డింపులకు తెరతీసింది.
ఇక, ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పది నెలల్లోనే తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది. ఒకటి అరా హామీలు మినహా మరే ఇతర గ్యారెంటీలను అమలు చేయలేదు. పైగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటూ విమర్శలు మూటగట్టుకొన్నది. ఇవన్నీ గమనించిన హర్యానా ఓటరు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ కొట్టాడు.
హిమాచల్ లో ఒకొక్కరిపై రూ. 1.17 లక్షల అప్పు భారం
2022 చివర్లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు.
ఇదేమీ పట్టించుకోకుండా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది. ఆఖరికి పెన్షన్ల శాఖలో ఉండే పింఛనర్ల సంక్షేమ నిధి నుంచి సైతం ప్రభుత్వం డబ్బును వాడుకుంది. మొత్తం 14 సబ్సిడీలపై కోతలు విధించేందుకు సిద్ధమైంది.
తమ జీతాలు రెండు నెలలు వాయిదా వేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.17 లక్షల అప్పు భారం ఉంది.
పన్నులతో కర్ణాటకలో మోత
5 గ్యారెంటీలను ఆశగా చూపెట్టి కిందటి ఏడాది మేలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను పెంచుతూ నోటిఫికేషన్ జారీచేసింది. పెట్రోల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను 25.92 నుంచి 29.84 శాతానికి (3.92 శాతం పెరుగుదల), డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి (4.1 శాతం పెరుగుదల) పెంచింది.
దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 మేర పెరిగింది. ఐదు హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.52 వేల కోట్ల భారం పడుతుంది. దీంతో గ్యారెంటీల అమలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోడానికి ఛార్జీల పెంపు, పన్ను వసూళ్లకు సర్కారు తెగబడుతున్నది. గైడెన్స్ వాల్యూ ట్యాక్స్, దేశీయ లిక్కర్‌పై, బీర్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, కొత్తగా రిజిస్టరైన రవాణా వాహనాలపై అదనపు సెస్, రూ.25 లక్షల పైబడిన ఎలక్ట్రికల్ వాహనాలపై లైఫ్‌టైమ్ ట్యాక్స్ విధించింది. ఇక, ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీసింది.
మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గహలక్ష్మి’ స్కీంకు కొత్త ఆంక్షలు జోడించింది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చింది. బస్సు సర్వీసులను తగ్గించింది. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీంలోనూ కోతలు విధిస్తున్నది. అంతేకాదు, ముడా, వాల్మీకి తదితర స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు చిరునామాగా మారింది.
తెలంగాణాలో హామీలను అటకెక్కించింది
6 గ్యారెంటీల పేరిట తెలంగాణలో నిరుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అటకెక్కించింది. ఒకటీ, అరా పాక్షికంగా అమలు చేసి చేతులు దులుపుకొన్న ది. మహాలక్ష్మి పథకంలో ప్రధానమైన హామీ ప్రతీ మహిళకు నెలకు రూ. 2,500 సాయం ఇంకా అమలుకాలేదు. రైతు భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి హామీలను గాలికొదిలేసింది.
రుణమాఫీ అంటూ ప్రకటించి అభాసుపాలైంది. 10 నెలల వ్యవధిలో రూ. 73 వేల కోట్ల అప్పు చేసి రాష్ర్టాన్ని అథోగతిపాల్జేసింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రాను తెరమీదకు తెచ్చిం ది. పేదల ఇండ్ల కూల్చివేతే టార్గెట్‌గా హైడ్రా చర్యలు ఉండటంతో ప్రజాక్షేత్రం నుంచి విమర్శలపాలైంది. ఆర్ఆర్ఆర్ రూట్ మ్యాప్, మూసీ రివర్ ఫ్రంట్‌లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో రేవంత్ సర్కారుపై ఢిల్లీలోని అధిష్ఠానం కూడా ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
More Stories
ఆయుధ కొనుగోళ్లలో స్వావలంబనకు పెద్దపీట
స్మృతి కేంద్రంగా హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ జన్మించిన గృహం
మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం