ఇజ్రాయెల్‌పై గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా, యెమెన్ నుంచి హౌతీ రాకెట్లవర్షం కురిపించాయి. టెల్ అవీవ్ నగరం లక్ష్యంగా హమాస్ రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని మూడో పెద్ద నగరమైన హైఫాను లక్ష్యంగా చేసుకొని హెజ్బొల్లా భారీ ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. దక్షిణ హైఫాలోని ఇజ్రాయెల్ మిలిటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని ‘ఫది 1’ మిసైళ్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. తైబెరియాస్పై దాడి చేసినట్టు తెలిపింది.
హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లు హైఫాను తాకినట్టు ఇజ్రాయెల్ పోలీసులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 10 మంది గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, లెబనాన్ నుంచి హెజ్బొల్లా 135 రాకెట్లను ప్రయోగించగా, అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా యెమెన్ నుంచి పేల్చిన క్షిపణిని సైతం అడ్డుకున్నట్టు పేర్కొన్నది.
మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని జబాలియా శరణార్థ శిబిరంతో పాటు పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది పాలస్తీనా వాసులు మరణించారు. కాగా, ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 10 మంది అగ్నిమాపక సిబ్బంది సహా 22 మంది మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా, అక్టోబర్ 7 దాడికి ఏడాది గడిచిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు అందరినీ వెనక్కు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ‘మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసం అక్టోబర్ 7 లాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు మన ప్రాంతంలో భద్రత వాస్తవిక పరిస్థితులను మారుస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవంక, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అణ్వాయుధ తయారీ దిశగా ఇరాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అణు పరీక్షలు జరిపిందని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబరు 5న ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపానికి అణుపరీక్షలే కారణమని అనుమానిస్తున్నారు.
కాగా, ఊహించిన దాని కంటే వేగంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయగలదని తాజాగా ది హెరిటేజ్ ఫౌండేషన్ పేర్కొన్నది. ఇరాన్ చాలా ఏండ్లుగా అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి