
వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. సోమవారం ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డిసెంబరులో శంకుస్థాపన సేందుకు రావలసిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. బుడమేరు వరదలపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి.
అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్లోనే కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేందుకు నిధులిచ్చి సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
‘రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించాలి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనను రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 60 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలి. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలి’ అని కోరారు.
మోదీతో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ రైల్వే, ఎలకా్ట్రనిక్స్- ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధుల మంజూరు, విశాఖ రైల్వే జోన్ పురోగతిపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి అనుసంధానించే రైల్వే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రంలోని పోర్టుల అభివృద్థి, అనుసంధానంపైనా కేంద్ర మంత్రితో భేటీలో చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
ప్రధానితో చర్చలు ఫలవంతంగా జరిగాయని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన వ్యయ అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపానని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారని చెప్పారు.
ఏపీలోని హౌరా- చెన్నై మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చడం, 73 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, మరిన్ని లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే జోన్ హామీని ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో లాజిస్టిక్, కమ్యూటర్ మౌలిక వసతుల బలోపేతానికి రైల్వేతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామని సీఎం తెలిపారు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు