
గత ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది కాలంగా రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. పరస్పరం ప్రతీకార దాడులతో కొనసాగుతున్న పోరు సామాన్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నది. యుద్ధం వల్ల గాజాలో వేలాది మంది మృతి చెందగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్‌లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరగాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 24 మంది మరణించారు. శనివారం ఇజ్రాయెల్ దళాలు తొలిసారిగా లెబనాన్‌లోని ట్రిపోలి నగరంపై దాడులు జరిపాయి. మరో పక్క ఇజ్రాయెల్‌పై దాడులు జరిపి ఏడాదైన సందర్భంగా గాజా నుంచి హమాస్ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది.
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతితో గట్టి షాక్‌లో ఉన్న హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలిసింది. మరో కరుడుగట్టిన నేత, నస్రల్లా వారసుడు సఫీద్దీన్, ఇరాన్ కమాండర్ ఇస్మాయిల్ కూడా మరణించినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఖుడ్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఘనీ జాడ కొన్ని రోజులుగా తెలియడం లేదు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడి అనంతరం ఆయన కన్పించడం లేదని, బహుశా ఆ దాడిలో ఆయన మరణించి ఉండవచ్చునని కొన్ని టర్కీ, ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడిచేయొచ్చన్న భయాల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
పాలస్తీనా తరపున యుద్ధంలో ఇరాన్, హెజ్బొల్లా జోక్యం చేసుకోవడంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పశ్చిమాసియా రణ రంగంగా మారింది. దీనిపై ఐరాసతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధ విరమణకు అవి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ యుద్ధం గాజా, పాలస్తీనా, లెబనాన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. హమాస్ ఆరోగ్య శాఖ ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 41,700 మంది మరణించారు.
మే 7న చాలా మంది శరణార్థులు తల దాచుకున్న గాజా దక్షిణ ప్రాంతంలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ప్రారంభించింది. ఈజిప్ట్‌తో సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకొని సాయం అందే మార్గాన్ని దిగ్బంధం చేసింది. జూలై 13న హమాస్ సైన్యాధిపతి మొహమ్మద్ డైఫ్‌ను అంతమొందించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్ అండ కలిగిన హౌతీ రెబెల్స్ సాయంతో యెమెన్ టెల్ అవీవ్‌పై చేసిన దాడికి ప్రతిగా జూలై 20న ఇజ్రాయెల్ యెమెన్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు ప్రతిరోజూ పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. జూలై 30న బీరుట్‌పై జరిగిన దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్ మరణించారు. ఆ తర్వాతి రోజే హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియహ్ ఇరాన్‌లో జరిగిన ఒక దాడిలో చనిపోయారు. దీనికి ఇజ్రాయెలే కారణమని హమాస్ ఆరోపించింది.
ఆగస్టు 16న అమెరికా ప్రతిపాదించిన కొత్త సంధిని హమాస్ తిరస్కరించింది. ఆగస్టు 22న ఈజిప్ట్, ఖతార్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించినా అవి విఫలమయ్యాయి. ఆగస్టు 25న లెబనాన్‌పై పెద్ద యెత్తున దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించగా.. వందలాది డ్రోన్లు, రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించామని హమాస్ తెలిపింది.
సెప్టెంబర్ 17, 18న లెబనాన్‌లో వేలాది మంది హెజొల్లా సభ్యుల పేజర్లు, వాకీటాకీలు పేలి కనీసం 39 మంది మృతి చెందగా, మూడు వేల మంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యలమని ఇజ్రాయెల్ ప్రకటించకపోయినా గాజాపై యుద్ధాన్ని విస్తరిస్తామని ప్రకటించింది. లెబనాన్‌పై బాంబు దాడులు కొనసాగించింది. సెప్టెంబర్ 27న దక్షిణ బీరుట్‌పై దాడి చేసి హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను మట్టుపెట్టింది.
నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రతిన బూనారు. నస్రల్లా, హనియా మృతికి బదులు తీర్చుకొనేందుకు అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో పరిమితంగా భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన రోజే ఈ దాడి జరిగింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు