జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులొద్దు

జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులొద్దు

ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న కారణంతో పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో భావ స్వేచ్ఛ హక్కును గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘యాదవ్‌ రాజ్‌ వర్సెస్‌ ఠాకూర్‌ రాజ్‌’ అన్న శీర్షిక కింద ‘ప్రభుత్వ యంత్రాంగంలో కుల సమీకరణలపై’ ఆ పాత్రికేయుడు ఓ వ్యాసాన్ని రాశారు.

కీలక పదవుల్లో అధికారులను నియమించడంలో ‘కుల పరంగా మొగ్గు’ కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం లఖ్‌నవూలోని హజరత్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో గత నెల 20న ఆయనపై కేసు పెట్టింది. భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది.

జాతి సమగ్రతకు భంగం కలిగించడం, మతపర విద్వేషాలను రెచ్చగొట్టడం, పరువు నష్టం కలిగించడం సహా పలు ఆరోపణలు చేసింది. దీన్ని కొట్టివేయాలని కోరుతూ ఆయన చేసిన వినతిపై విచారణ జరిపిన ధర్మాసనం..ఇలాంటి కథనాలను ప్రభుత్వంపై చేసిన విమర్శలుగా భావించి క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని తెలిపింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది.

పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేవలం జర్నలిస్టు రాసినవి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్‌ కేసులు పెట్టొద్దు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

ఈ లోగా పిటిషనర్‌దారుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా, యూపీ పోలీసులు అధికారిక ‘ఎక్స్‌’ అకౌంట్‌ ద్వారా చట్టపరమైన చర్యలు ఉంటాయని పిటిషనర్‌ను హెచ్చరించారని, అతడిపై రాష్ట్రంలో ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయో కూడా తెలియని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించినట్టు పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.