శ్రీవారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. 

సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అటు, కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫోటో ప్రదర్శన శాలలను టీటీడీ శుక్రవారం ప్రారంభించింది.

ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, శేషాచల శ్రేణుల సెట్టింగ్, శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ శిల్పకళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం నుంచి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి.  బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

బ్రహ్మోత్సవాలు తొలిరోజు చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆంజజేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించారు. ముందుగా ఆలయ మర్యాదల ప్రకారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో శ్యామలరావు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం  వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.