
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు సరిపోదని, కేంద్రం తరపున అధికారిని నియమించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పిటిషనర్లతో పాటు టీటీడీ, కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని తెలిపింది.
కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, విమర‌్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఏమాత్రం అమోదయోగ్యం కాదని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం ప్రకటించింది. సొలిసిటర్ జనరల్ సైతం స్వతంత్ర దర్యాప్తు చేపడితేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు