ఐదేళ్లలో 200 రైల్వే ప్రమాదాలు .. 351 మంది మృతి

ఐదేళ్లలో 200 రైల్వే ప్రమాదాలు .. 351 మంది మృతి

గత ఐదేళ్లలో జరిగిన 200 రైల్వే ప్రమాదాల్లో 351 మంది  మృతి చెందగా, 970 మంది గాయపడ్డారని 17 రైల్వే జోన్‌ల నుండి సేకరించిన డేటా వివరాలను భారతీయ రైల్వే వెల్లడించింది.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోల్‌కతాలోని పిఎస్‌యు బ్రైత్‌వైట్ అండ్ కోని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 171 ప్రమాదాలు జరుగుతుండగా, ఇప్పుడు అది 40 ప్రమాదాలకు తగ్గిందని పేర్కొన్నారు. 

ఐదేళ్లలో (2019-20 నుండి 2023-24 వరకు) రైల్వే శాఖ రూ. 32 కోట్ల పరిహారం అందించిందన్నారు. ఈ మొత్తంలో రైలు ప్రమాదాల్లో మరణించిన వారి బంధువులకు రూ. 26.83 కోట్లు, గాయపడిన వారికి రూ. 7 కోట్లు అందించారని తెలిపారు. ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే దాఖలు చేసిన సమాచార హక్కు ప్రశ్నకు సమాధానంగా ఈ డేటా షేర్ చేశారు.

గత ఏడాది జూన్‌లో బాలాసోర్ మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనతో సహా జరిగిన 10 ప్రమాదాల్లో 297 మంది మరణించగా, 637 మంది గాయపడ్డారు. దీని తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో 15 ప్రమాదాలు జరగడంతో 20 మంది మరణించగా, 79 మంది గాయపడ్డారు. జూలైలో జరిగిన పెద్ద ప్రమాదం కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. ఇది 10 మంది ప్రాణాలను బలిగొంది. 

సెంట్రల్ రైల్వే జోన్‌లో 22 ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. తూర్పు రైల్వేలో 12 ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడగా, ఈస్ట్ సెంట్రల్ జోన్‌లో 18 ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారు.

నార్త్ సెంట్రల్ జోన్‌లో 21 ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా 49 మంది గాయపడగా, ఉత్తర రైల్వేలో 25 ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ మధ్య రైల్వేలో 12 ప్రమాదాల్లో ఒకరు మరణించగా, 26 మంది గాయపడ్డారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్‌లో తొమ్మిది ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో తొమ్మిది ప్రమాదాల్లో తొమ్మిది మరణాలు, 45 మంది గాయపడగా, నార్త్ వెస్ట్రన్ జోన్‌లో 70 మంది గాయాలతో పది ప్రమాదాలు జరిగాయి. వెస్ట్ సెంట్రల్ జోన్‌లో ఏడు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. పశ్చిమ జోన్‌లో 12 ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు.

సురక్షిత జోన్‌లలో రెండు ప్రమాదాలు జరిగిన ఈశాన్య జోన్, మూడు ప్రమాదాలు జరిగిన కొంకణ్ రైల్వే, నైరుతి & దక్షిణ రైల్వే జోన్‌లు వరుసగా తొమ్మిది మరియు నాలుగు ప్రమాదాలు నమోదయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.