
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబరు 03 రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు.
అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం.
అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.
కాగా, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ కార్యక్రమం జరుగుతుందన్నారు. అక్టోబరు 12న విజయదశమి సందర్భంగా రాత్రి 7:45 గంటలకు పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. .
నవరాత్రి ఉత్సవాల కారణంగా 10 రోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 4, 11వ తేదీలలో లక్ష్మీపూజ, అక్టోబరు 12న ఊంజల సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
నవరాత్రి ఉత్సవాల కారణంగా 10 రోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 4, 11వ తేదీలలో లక్ష్మీపూజ, అక్టోబరు 12న ఊంజల సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు