కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున్ స్వామిని ఏ3గా, భూమి అమ్మిన దేవరాజ్‌ను ఏ4గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
కోట్ల విలువైన భూమిని దేవరాజ్ నుంచి మల్లికార్జున్ స్వామి కొనుగోలు చేశాడు. ఆ భూమిని అక్క పార్వతికి బహుమతిగా ఇచ్చాడు. మొదటిసారి తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ‘నేనేం తప్పు చేయలేదు. నాపై రాజకీయ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది రాజకీయ కేసు, దయచేసి అండర్‌లైన్ చేయండి’ అని మీడియాతో పేర్కొన్నారు.
తన రాజీనామాను డిమాండ్ చేస్తూ బీజేపీ చేస్తున్న నిరసనలపై మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. ‘నేనెందుకు రాజీనామా చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే రాజీనామా చేయాలి, తప్పు చేయలేదని చెబుతున్నప్పుడు, రాజీనామా చేసే ప్రశ్న ఎక్కడ ఉంది?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తనను చూసి భయపడుతన్నాయని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, మైసూరు అభివృద్ధి సంస్థ పార్వతి నుంచి 3.16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. ఎక్కువ విలువైన ప్లాట్లను పరిహారంగా ఆమెకు ఇచ్చింది. అయితే చట్టవిరుద్ధమైన భూ పరిహార ఒప్పందం వల్ల సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య సుమారు రూ.4,000 కోట్ల మేర లబ్ది పొందినట్లు ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆగస్టులో అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ ఆరంభంలో గవర్నర్ అనుమతిని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. మరోవైపు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై మైసూరులోని లోకాయుక్త స్పందించింది. ఈ భూ స్కామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిదితో పాటు మరో వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ సిద్ధరామయ్య మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ముడా స్కామ్‌లో సీబీఐ విచారణ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నమని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా పేర్కొన్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు