
ఈ నేపథ్యంలో సమాచార సేకరణ నుంచి కార్డుల జారీ వరకు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది.
వ్యక్తుల సమాచారాన్ని వారి అనుమతితోనే రెండు దశల్లో సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ హెల్త్ కార్డులో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. బార్ కోడ్ కూడా ఉంటుంది. సర్వే వివరాల నమోదుతో పాటు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి రాష్ట్ర ఐటీ శాఖ నుంచి సహకారం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులివ్వడానికి సుమారు రూ.180 కోట్లు అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సి వస్తుందని, హెల్త్ కార్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
“ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాం. పూర్తి సమాచారాన్ని డిజటలైజేషన్ చేస్తాం. క్యూఆర్ కోడ్ తో రూపొందిస్తారు. వ్యక్తి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. తద్వార భవిష్యత్తులో సదరు వ్యక్తికి అందించే వైద్య సేవల విషయంలో వైద్యులకు పూర్తి అవగాహన వస్తుంది. 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తారు” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామని చెబుతూ హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుందని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?