రసాభాసగాజీవీఎంసీ కౌన్సిల్ భేటీ .. మేయర్ రాజీనామాకై డిమాండ్

రసాభాసగాజీవీఎంసీ కౌన్సిల్ భేటీ .. మేయర్ రాజీనామాకై డిమాండ్

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది. నగర పాలక సంస్థ మేయర్‌ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుపట్టడంతో కౌన్సిల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే జీవిఎంసీలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై కూటమి కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు.  యూసీడీ నిధులలో మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్, కట్ట మూరి సతీష్లు ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావులు అవినీతికి పాల్పడ్డరని విచారణ కోరుతూ డిమాండ్ చేశారు.

పాలకవర్గం సమావేశం మొదలైన వెంటనే సీపీఎం నేత సీతారాం ఏచూరికి నివాళి అర్పించి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జీరో అవర్ నడపాలని కార్పొరేటర్లు పట్టుపట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. అదే సమయంలో రఘురామ కృష్ణంరాజు, పంతం నానాజీలపై చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులు పట్టుకొని కౌన్సిల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఎక్కడో జరిగిన సంఘటనలు పట్టుకొని ఈక్కడికి రావడంమెంటని జనసేన కార్పొరేటర్ల ఆకార్డులను తీసిపారేశారు.

అనంతరం సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ గంగారంతో సహా, వామపక్ష కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూ నినాదాలు చేశారు. గతంలో చేసిన తీర్మానం ఏమైందని, దానిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రతిగా మాటల దాడికి దిగారు. ఈ గందరగోళ సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరి వెంకట కుమారి పదవిలో ఉండే నైతిక హక్కు లేదంటూ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. మేయర్‌ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు.

మేయర్ తనపై విచారణ చేయవచ్చని ఆమె సమాధానం చెప్పినా, సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.  ఈ క్రమంలోనే కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకుని జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టర్ విచారణ చేయాలని వినతి పంపుతామని చెప్పారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు.

వెంటనే కూటమి కార్పొరేటర్లు జీవీఎంసీ కమిషనర్ను కలిసి నగర పాలక సంస్థలో జరిగిన అవినీతి అంశాలుపై విచారణ చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్లు, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్లు అవినీతి మీద విచారణ జరిపించాలని కూటమి కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.