
* లడ్డూ అపచారంపై సిట్ దర్యాప్తు
రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వాడుకున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని గుర్తుచేశారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లడ్డూ వ్యవహారంపై ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని, వాళ్లు విచారణ చేసి ఇచ్చే రిపోర్టును బట్టి, బాధ్యులని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ‘మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు, ఇతర మతస్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అన్నింటి కంటే పెద్దదైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన సమయంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామి వారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలకు విలువలేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. తిరుమల లడ్డూ న్యాణ్యత, సువాసనకు ఎంతో విశిష్టత ఉందని చెబుతూ స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చేయాలనుకున్నా చేయలేకపోయారని తెలిపారు.
అంతటి విశిష్టత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారని మండిపడ్డారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్లో పాల్గొనలేక పోయాయని చెప్పారు. వైఎస్సార్సీపీ వచ్చీ రావడంతోనే ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీశారని, ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్గా మార్చేశారని ధ్వజమెత్తారు.
ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అన్య మతస్తులను టీటీడీ ఛైర్మన్గా వేశారని, రాజకీయ కేంద్రంగా బోర్డుని వాడుకున్నారని దుయ్యబట్టారు. తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తిరుమల ప్రక్షాళనకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని, శ్యామలరావుకి చెప్పి, అందుకనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈవోగా నియమించినట్లు వివరించారు.
లడ్డూ నాణ్యతపై అనుమానం తోనే 4 ట్యాంకర్లను ఎన్‌డీడీబీ పరీక్షలకు పంపామని, ల్యాబ్లో పరీక్షల తర్వాత ఎస్ వాల్యుల్లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని వెల్లడించారు. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్ట్లో పెట్టడం వంటి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారని పేర్కొన్నారు.
అధికారం చేపట్టాక ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకుని ఎన్నో వాస్తవాలు వెలుగు చూశాయని తెలిపారు. చేసిన తప్పుని సమర్ధించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి జగన్‌కి ఎంత ధైర్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్థుడు కాబట్టే జగన్ని ఎస్కోబార్ అన్నానని గుర్తుచేశారు.
ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారని నిలదీశారు. టీటీడీ ఛైర్మన్గా చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుందని గుర్తుచేశారు. మరో మాజీ ఛైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశాడని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మతసామరస్యాన్ని కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురు దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 3.75 లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము