మూడు నెలల్లో బీసీల కులగణన పూర్తి చేయాలి

మూడు నెలల్లో బీసీల కులగణన పూర్తి చేయాలి

సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా కులగణన జరగాలని హైకోర్టు పేర్కొన్నది. వికాస్‌కిషన్‌రావ్‌ గావ్లీ వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీసీల సమకాలీన, అనుభావిక పరిశీలన జరగాలని తెలిపింది. 

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 5ను సవాలు చేస్తూ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌, ఎర్ర సత్యనారాయణ, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. 

స్థానిక సంస్థల యూనిట్‌గా బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్రం యూనిట్‌గా కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కులగణనను మంగళవారం నుంచి మూడు నెలల్లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్‌ టెస్ట్‌ ఉద్దేశం కూడా ఇదేనని, ఆ కోణంలోనే సర్వే జరగాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2010లో కృష్ణమూర్తి కేసులో వెలువడిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోరాదని, రాజకీయ వెనుకబాటుతనాన్నే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.

వికాస్‌కిషన్‌రావు గావ్లీ వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులోని 13వ పేరా ప్రకారం.. రాష్ట్రమంతటినీ ఒకే యూనిట్‌గా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఆ తీర్పు మేరకు స్థానిక సంస్థలను యూనిట్‌గా తీసుకొని సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ వివరాల రిజర్వేషన్లపై నిర్ణ యం తీసుకోవాల్సివుంటుందని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి 3నెలల గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మూడు నెలల్లోగా కులగణన నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

వికాస్‌కిషన్‌రావ్‌ గావ్లీ వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో 2021 మార్చి 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని 13వ పేరాలో… ‘మహారాష్ట్ర జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితి చట్టం – 1961లోని సెక్షన్‌ 12 (2) (సీ) ప్రకారం బీసీ రిజర్వేషన్లు 27 శాతంగా ఉన్నాయి. దీనిని ఏకరీతిగా మొత్తం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఒకే తరహాలో అమలు చేయడం సబబు కాదు.

అన్ని స్థానిక సంస్థల్లోనూ ఒకే తీరుగా బీసీ రిజర్వేషన్ల అమలు చేయడం సరికాదు. స్థానిక సంస్థల వారీగా బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని సర్వే చేయా లి. సమకాలీన పరిస్థితులను శాస్త్రీయంగా, లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది.