రైతులకు ఆధార్ తరహా ఐడీ కార్డులు

రైతులకు ఆధార్ తరహా ఐడీ కార్డులు
వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్‌ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులను వచ్చే నెల నుంచి జారీచేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నామని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది వెల్లడించారు. 
 
ఢిల్లీలో జరిగిన అగ్రి-టెక్ సమ్మిట్, స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చతుర్వేది మాట్లాడుతూ.. అక్టోబరు మొదటివారంలో రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మంది రైతులకు ఈ విశిష్ట గుర్తింపును ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్‌ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమలు చేశామని, మరో 19 రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం కావడానికి సమ్మతించాయని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆధార్‌ తరహా ఐడీ కార్డులను అందజేస్తామని చతుర్వేది తెలిపారు. 

ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ ఐడీ ద్వారా రైతులు తాము పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించుకోవచ్చని వివరించారు.