మానవ వైఫల్యంతోనే విజయవాడలో బుడమేరు ప్రళయం!

మానవ వైఫల్యంతోనే విజయవాడలో బుడమేరు ప్రళయం!
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బుడమేరు వరద విజయవాడ నగరంలో ప్రళయం సృష్టించడం పకృతి వైపరీత్యం కాదని, `మానవ నిర్మిత విపత్తు’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై అధికార టిడిపి నేతలు మండిపడ్డారు. ఎదురు దాడికి దిగారు. అయితే, అంతర్గత విచారణలో సహితం దాదాపు అటువంటి నిర్ణయానికే వస్తున్నట్లు తెలుస్తున్నది.
 
ఇటీవల సంవత్సరాల్లో ఈ స్థాయిలో వరద ముప్పు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న కీలక అధికారులు ప్రమాద స్థాయిని ఊహించక పోవడం ఒక కారణం కాగా, మరోవంక ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణి కూడా కారణమైనట్లు స్పష్టం అవుతుంది. నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నల్టు తెలుస్తోంది.
 
ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వారిపై `క్రమశిక్షణ చర్య’ అని కాకుండా, వారిని కీలక పోస్టుల నుండి తప్పించేందుకు నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ధోరణిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందినట్లు తెలుస్తోంది.
 
దాదాపు ఎనిమిది మంది అధికారులను బాధ్యులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల వైఫల్యంపై ఇప్పటికే నివేదిక ముఖ‌్యమంత్రికి చేరిందమి. లక్షలాది మందిని నిరాశ్రయులు కావడంతో పాటు కనివిని ఎరుగని విపత్తును గుర్తించడంలో విఫలమైన అధికారులను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు కురిసిన వర్షంతో వెలగలేరు డైవర్షన్ స్కీమ్‌ ఎగువున ప్రవాహం పోటెత్తింది. బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్టు 31వతేదీ మధ్యాహ్నానికి ఇరిగేషన్ అధికారులు గుర్తించారు.
అయితే, బుడమేరు ఎగువున ఎంత వర్షపాతం కురుస్తుందో, ఎంత ప్రవాహం దిగువకు లెక్కిస్తుందో టెలిమెట్రి వ్యవస్థ అందుబాటులో లేదు. మండల స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేసే వ్యవస్థలు ఉన్నా బుడమేరు పరివాహక ప్రాంతానికి వస్తున్న ప్రవాహాలను అంచనా వేసే పరిజ్ఞానం జలవనరుల శాఖ వద్ద అందుబాటులో లేదు.

31వ తేదీ విజయవాడలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ఐఎండి అంచనాలు, విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన కూాడా రద్దు చేసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది.

భారీ వర్షం కారణంగా జాతీయ రహదారులన్నీ అప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ బెంజిసర్కిల్ నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్ స్టేషన్‌ సమీపంలో ఆయిల్ ట్యాంకర్లు, ట్రావెల్స్‌ బస్సులు నీటిలో నిలిచిపోయాయి.

బెంజిసర్కిల్ మొదలుకుని మహానాడు జంక్షన్, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు వరకు జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరదలు, కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తాయనే హెచ్చరికలు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 31వ తేదీ శనివారం తన హైదరాబాద్ పర్యటన వాయిదా వేసుకుని ఉండవల్లిలోనే ఉండిపోయారు.

31వ తేదీ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో చర్చించారు. అయితే, 31 మధ్యాహ్నం ముఖ్యమంత్రి  హైదరాబాద్ వెళ్లిపోతారనే సమాచారంతో ముఖ్యమైన అధికారుల్లో కొందరు హైదరాబాద్ వెళ్లిపోయారు. అదే రోజు మధ్యాహ్నం జలవనరుల శాఖ అధికారులు వరద సమాచారాన్ని ప్రభుత్వానికి చెరవేశారు. అయినా, వరదలపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారుల వరకు వరద సమాచారం చేరనట్టు తెలుస్తోంది.

బుడమేరు వరదల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై 2011లోనే స్టాండర్డ్ ప్రోసిజర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌, విజయవాడ పోలీస్ కమిషనరేట్‌, ఫైర్ , డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, రెవిన్యూ, అగ్రికల్చర్ శాఖల మధ్య సమన్వయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత బుడమేరుకు ఈ స్థాయిలో వరదలు రాకపోవడం, ప్రభుత్వ శాఖల్లో అనుభవం లేని అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం వంటి కారణాలు విపత్తుకు కారణం అయ్యాయని స్పష్టం అవుతుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం, అంతా నిద్రలో ఉండగా నీట మునిగి అపార నష్టం వాటిల్లింది.

మరోవైపు ఇరిగేషన్ ఇంజినీర్లు సరైన సమయానికే వెలగలేరు షట్టర్లు ఎత్తారని రెగ్యులేటర్ల నిర్వహణ పట్టించుకోలేదని ఇరిగేషన్ అధికారుల ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా బుడమేరు వరద ముంపు అధికారుల వైఫల్యమేనని, నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్న అధికారుల ఉదాసీనతే నగరాన్ని ముంచిందని స్పష్టం అవుతుంది.