
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందించనుంది. నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,164.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు అని ప్రాధమికంగా అంచనా వేశారు.
అదేవిధంగా, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు రూ.75.5 కోట్లు, ఉద్యానశాఖకు 39.9 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాలలో నష్టం అంచనా వేయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. నివాసితులు ఇంటి వద్ద అందుబాటులో ఉంటే పూర్తి స్థాయి వివరాల నమోదు అవకాశం ఉంటుందని చెప్పారు. 32 వార్డులలో 149 సచివాలయాల పరిధిలో రెండు లక్షల నివాసాలలో నష్టం గణన చేపట్టనున్నట్లు తెలిపారు.
నష్టం గణన బృందానికి ఆదివారం విజయవాడలో ఒక రోజు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్ లతో సహా పలువురి సేవలు ఉపయోగించుకుంటామని ఆర్పీ సిసోడియా తెలిపారు. ప్రతి డివిజనుకు ఒక జిల్లా స్ధాయి అధికారి నేతృత్వం వహిస్తారని చెప్పారు. ప్రతి రెండు డివిజన్లకు ఒక ఐఎఎస్ అధికారి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
ఒక డివిజను లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు వెళ్తాయని, వాణిజ్య సముదాయాల్లో నష్టం గణన కోసం 200 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల పరిధిలో 43 మంది చనిపోయారని, 35 మంది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే చనిపోయారని చెప్పారు.
ఆవులు, గేదెలు, గొర్రెలు ఇతర పశువులు 420, 62 వేల 424 కోళ్లు చనిపోయాయని అన్నారు. 1.93 లక్షల హెక్టార్లలో వరి ఇతర పంటలు, 25 హెక్టార్ల వాణిజ్య పంటలకు నష్టం జరిగిందనేది ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. 3 వేల 868 కిలోమీటర్ల పొడవు ఆర్ అండ్ బి రోడ్లు, 353 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. బుడమేరులో ఆరు గండ్లు పడ్డాయని, అందులో మూడు గండ్లు పూడ్చామని వివరించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు