
డిజియాత్ర మొబైల్ యాప్ విమాన ప్రయాణీకులకు సౌకర్యవంతంగానూ, సమయం కలిసి వచ్చేదిగాను ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో ఈ-డిజియాత్రను సేవలను ప్రారంభిస్తూ ఇప్పటివరకు 54 లక్షల మంది ప్రయాణికులు ఈ యాప్ ద్వారా ప్రయోజనం పొందారని చెప్పారు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ప్రత్యక్షంగాను, పట్నా, రాయ్‌పుర్, భువనేశ్వర్, గోవా, ఇందౌర్, రాంచీ, కొయంబత్తూర్, బాగ్‌డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్‌గాను ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజి యాత్రను ప్రోత్సహించడానికి తొమ్మిది విమానాశ్రయాలను సమన్వయం చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో 12 ఎయిర్ పోర్టులకే ఈ సదుపాయం ఉందని, ఇప్పుడు అది 21 ఎయిర్ పోర్టులకు విస్తరించిందని వివరించారు. ఎయిర్ పోర్టు కి వచ్చినపుడు నేరుగా డిజియాత్ర గేట్ ద్వారా వెళ్తే సమయం ఆదా అవుతుందని చెప్పారు. పాతపద్దతిలో వెళ్తే నిమిషంన్నర వరకు సమయం పడితే, డిజియాత్ర ద్వారా కేవలం ఐదు సెకెన్లలోనే పని పూర్తవుతుందని పేర్కొన్నారు.
కాగా, ఈ యాప్ లో ప్రయాణికుల వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు పౌర విమానయాన శాఖ తీసుకుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. దేశంలో అన్ని ఎయిర్ పోర్టులలోనూ డిజియాత్ర సదుపాయం క్రమంగా విస్తరిస్తామని చెప్పారు. మల్టిపుల్ పాయింట్స్‌లో విశాఖలో కొత్త ఎయిర్ పోర్టు రెండేళ్ల లోపుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
పౌరవిమానయానశాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డిజి యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రామ్మోహన్‌నాయుడు కోరారు. కరోనా సమయంలో దీన్ని ప్రారంభించగా లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని చెప్పారు.
ఈ యాప్‌లో బోర్డింగ్, ఐడీ ఇతర వివరాలను నమోదు చేసుకుంటే విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ తనిఖీ లేకుండా నేరుగా డిజియాత్ర గేటుద్వారా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుందని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సమయాన్ని ఆదాచేసే ఆలోచనతోనే డిజియాత్ర యాప్‌ను ప్రారంభించామని తెలిపారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు