విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి

విద్యా కమిషన్ ఛైర్మన్ గా ఆకునూరి మురళి
 
* బిసి కమిషన్, రైతు కమిషన్ చైర్మన్ల నియామకం
 
తెలంగాణ ప్రభుత్వం 3 కమిషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ఇయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు.

మరోవైపు  రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు చేయటంతో పాటు చైర్మన్‌గా ఎం కోదండరెడ్డిని నియమించింది. రెండేళ్లపాటు ఛైర్మన్ గా పని చేయనున్నారు. ఇక బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం ముగియటంతో కొత్త ఛైర్మన్ ను నియమించింది. ఛైర్మన్‌గా నిరంజన్‌కు అవకాశం దక్కింది. 

 రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ సభ్యులుగా ఉన్నారు . ఈ మేరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  రాష్ట్రంలో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతోపాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ కమిషన్ కు ఛైర్మన్‌ తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్‌పర్సన్‌తోపాటు విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన ముగ్గురు సభ్యులు, విభాగాధిపతి స్థాయి సభ్య కార్యదర్శి ఉంటారని పేర్కొంది. కమిషన్‌లోని నాన్-అఫీషియల్ సభ్యుల పదవీకాలం నియామకం తేదీ నుంచి రెండేళ్ల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. సభ్యుల నియామకం జరగాల్సి ఉంది.