అలిపిరి పాదాల మండపం దగ్గర దివ్య దర్శనం టోకెన్లు

అలిపిరి పాదాల మండపం దగ్గర దివ్య దర్శనం టోకెన్లు
* త్వరలో ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు
 
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం దగ్గర దివ్య దర్శనం టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఈవో సమాధానం ఇస్తూ జూన్ నెల మొదటి వారంలో యాత్రికులకు వారానికి 1.05 లక్షల ఎస్ఎస్ డి టోకెన్లు ఇవ్వగా, ఇప్పుడు వారానికి 1.63 లక్షల టోకెన్‌లు జారీ చేస్తున్నామని తెలిపారు. 
 
ఎస్ఎసడి టోకెన్స్ పెంచిన కారణంగా ఈ టోకెన్ పొందిన భక్తుల నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గిందని చెప్పారు.  అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి తాము పంపలేకపోయామని తెలిపారు. 
 
 ప్రస్తుతం పంపిస్తున్నామని.. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంపామని వెల్లడించారు. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ⁠తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నామని చెబుతూ, దీనికి ఆధార్ కార్డు అవసరం లేదని స్పష్టం చేశారు.
 
⁠ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని స్పష్టం చేశారు. ⁠
 
ముఖ్యంగా నెయ్యి యొక్క నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నెయ్యి కల్తీనా కాదా తెలుసుకునేందుకు.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఒక గ్యాస్ క్రోమాటోగ్రాఫ్, హెచ్‌పిఎల్‌సిని విరాళం అందిస్తామని తెలిపారు. దీని ధర సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని.. వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరుస్తారని తెలిపారు.
 
తిరుమలలో దళారీ వ్యవస్థకు, అవకతవకలకు అరికట్టేందుకు తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర నుంచి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడుతుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు.