నేనూ రైతునే.. కర్షకుల పరిస్థితులు బాగా తెలుసు

నేనూ రైతునే.. కర్షకుల పరిస్థితులు బాగా తెలుసు
తాను కూడా రైతునేనని, అన్నదాతల పరిస్థితి బాగా తెలుసని చెబుతూ వరదల కారణంగా వరి, ఇతర పంటల సాగులో రైతులు కోలుకోలేనంత మొత్తంలో దెబ్బతిన్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని పేర్కొంటూ  ఖమ్మం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఐటీవలి వరదలు ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. మున్నేరు వరద ఉద్ధృతికి వేలాది ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం సంభవించింది. మున్నేరు, మధిరలో కట్టలేరు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని చెబుతూ ఈ విపత్కర సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పక అండగా నిలుస్తామని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చారు.
 
కేంద్రమంత్రితో తమకు జరిగిన నష్టాన్ని వివరించిన అన్నదాతలు, సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురైన రైతును కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ఓదార్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
 
కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో కలిసి  ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మున్నేరు, మధిరలో కట్టలేరు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాలేరు కాలువను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రులు పరిశీలించారు.
నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వర్ష బీభత్సానికి జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్​లో కేంద్రమంత్రికి భట్టి విక్రమార్క వివరించారు. చిత్ర ప్రదర్శన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భారీ వరదలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. 
 
రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని కేంద్రమంత్రి ఆరోపించారు. ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆయన, ఆ పథకం అమలులో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. కనీసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శించారు.