గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బుల్కాపూర్, కూకట్ పల్లి, బంజరా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం పెరిగి హుస్సేన్ సాగర్‌లో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది.
దాదాపు ఎఫ్టీఎల్‌కు చేరుకోవడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వరదనీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ కూడా హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలడిగి తెలుసుకుంటున్నారు.
సాగర్ నుంచి నీరును విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని దానకిశోర్ సూచించారు. చెరువుల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని అధికారులను దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని సూచించారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోని పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
ఆయా గ్రామాలకు వెల్లే రహదారులు కొట్టుకపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లేనని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది.
మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. షేక్‌పేట, టోలిచౌకీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు హైడ్రా కమిషనర్. టోలిచౌకి వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీటిని దగ్గరుండి సిబ్బందితో నాలాలోకి మళ్లించారు.
అలాగే బేగంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నాలాను, పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్ ఆదేశించారు.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!