విశ్వహిందూ పరిషత్ నేతలు మరుధమలై ఆలయ దర్శనం

విశ్వహిందూ పరిషత్ నేతలు మరుధమలై ఆలయ దర్శనం

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్రా తమిళనాడులోని ప్రసిద్ధ మరుధమలై ఆలయాన్ని సందర్శించి దేశాన్ని హిందూ ధర్మాన్ని రక్షించాలని, హిందూ సమాజపు ఆనందం,  శ్రేయస్సు కోసం ప్రార్థించారు. దర్శనానంతరం  ఆలోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఆలయం మురుగన్ ఏడవ స్థలం అని, ఇక్కడ విష్ణుమూర్తి, మురుగన్ భార్యల పవిత్ర విగ్రహాలు ఉన్నాయని పేర్కొంటూ ఇక్కడికి రావడం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తున్నదని తెలిపారు.

మురుగన్ ఆశీర్వాదం పొందడం, మొత్తం సమాజపు ఐక్యత, సామరస్యం కోసం మరుధమలై ఆలయంలో దర్శనం పొందడం తన జీవితంలోని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. శివుడు, పార్వతిదేవి, గణపతి , మురుగన్ దేశమంతటా పూజ్యమైన దేవుళ్ళు అని పేర్కొంటూ  వారితో పాటు, ఇక్కడ భక్తులు మురుగన్ మామగా పిలువబడే మహా విష్ణువును కూడా దర్శనం చేసుకుంటారని వివరించారు.

యావత్ ప్రపంచంలోని హిందూ సమాజాన్ని కలిపే ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం అదృష్టంగా పేర్కొన్నారు.  ఉత్తర భారతం,  దక్షిణ భారతంగా విభజించి ఆలోచించే మనస్తత్వం కలిగిన పార్టీలు పరిపాలన చేస్తున్న తమిళనాడులో ఉత్తర దక్షిణాలు అనే బేధం లేకుండా ధర్మం అందరినీ కలిపి ఉంచగలుగుతుందని శివ కుటుంబమే దానికి ఉదాహరణ అని తెలిపారు.

హిమాలయాలనుండి కన్యాకుమారి వరకు ప్రజలందరూ శివ కుటుంబాన్ని ఆరాధిస్తారని తెలియజేస్తూ వారు ఈ పవిత్ర హిందూ ధర్మ రక్షణకు భాషా భేదం ప్రాంతీయ భేదం రాజకీయాలు వదిలేసి అందరూ పూనుకోవాలని కోరారు. చెన్నై క్షేత్రం (తమిళనాడు పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలు) సంస్థాగత కార్యదర్శి  ఆకారపు కేశవరాజు కూడా వారి వెంట ఉన్నారు.