భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి సీఎం చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఎక్స్‌వేదికగా స్పందించిన సీఎం రేవంత్.. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ‘కోర్టులంటే గౌరవం లేదా?’ అంటూ కన్నెర్రజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉం టుందని తీవ్రంగా హెచ్చరించింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ-బీఆర్‌ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.
ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ర్టానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆయన (సీఎం రేవంత్‌రెడ్డి) నిన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఈ రోజు పొద్దున పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?’ అని ప్రశ్నించారు.
‘ఇలాంటి ప్రవర్తన, ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా?. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో మేము (కోర్టులు) జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెప్తుంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుంచి కూడా ఆశిస్తాం’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయచ్చని అనుకుంటున్నారా. నిన్ననే ఒక అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం’ అని మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే.. వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి.. అని జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో రేవంత్‌రెడ్డి తరపున న్యాయవాదులు స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరఫున సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వవద్దని విజ్ఞప్తిచేశారు. వారి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం