కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల నిధులు, రాష్ట్రంలో 2 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఏపీకి సంబంధించిన రెండు అంశాలను కేంద్రం స్పష్టం చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశ కలుగుతోందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఒక నమ్మకం, భరోసా ఇస్తున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి లోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌కు చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇది మనకు గుడ్ డే.. ఇది గుడ్ బిగినింగ్’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిరాశ, నిస్పృహలతో ఉన్న రాష్ట్రానికి ఇవాళ వచ్చిన సంచారం ఊరట కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. 

పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ సిద్ధంగా ఉందని, 2 ఏళ్లలో ఈ నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘పోలవరం నిర్మాణ పనులను తేదీల వారీగా ప్రస్తావిస్తూ ఈ నిధులు ఇస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ 2026 లోగా ప్రాజెక్ట్ పూర్తయ్యేలా ఈ నిర్ణయం ఉంది. ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లకు ధన్యవాదాలు” అని చెప్పారు. 

“ఈ ప్రాజెక్టుకు అంజయ్య భూమి పూజ చేశారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్టర్లు వల్ల ప్రాజెక్టు ఆరంభం ఆలస్యం అయింది. మాజీ సీఎం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు టెండర్లు పిలిచినా ముందుకు సాగలేదు. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇచ్చారు. 7 మండలాలతో ప్రాజెక్టుకు ఇబ్బందులు ఉంటాయని గుర్తించి కేంద్రానికి చెప్పాము. ఆర్డినెన్స్ ఇచ్చి ఆ మండలాలను ఏపీలో కలిపాకే సీఎంగా అప్పట్లో ప్రమాణం చేశాను’’ అని చంద్రబాబబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఘట్టాన్ని ఒక రికార్డుగా ముందుకు తీసుకెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. నాడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే అప్పటి మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీల సహకారంతో ముందుకు వెళ్లామని చెప్పారు.

‘‘ముందు రాష్ట్ర నిధులు చెల్లిస్తే కేంద్రం తర్వాత రీఎంబర్స్ చేసింది. 2019లో ప్రభుత్వం మారింది. మరలా పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం దాపరించింది. ఆకస్మిక తనిఖీలు చేశాం. పోలవరం కోసం 82 సార్లు రివ్యూ చేశాం. 25 సార్లు వర్చువల్‌గా చేశాం. ఇంత విలువ కలిగిన ప్రాజెక్టును విలువ తెలియని వ్యక్తులు నాశనం చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

“పోలవరం ప్రాజెక్టుకు 7 మండలాలు కావాలని తాను అడిగితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు సాయంత్రమే కాంట్రాక్టర్‌ను సైట్‌లో ఉండొద్దని ఆర్డరు ఇచ్చారు. దాని పర్యవసానం చూస్తే ఇంత దారుణం జరిగింది. 2 సీజన్ లలో ప్రాజెక్టు ను గాలికి వదిలేసి రివర్స్ టెండర్ అని పైశాచిక ఆనందం పొందారు. ఆగస్టు 2020లో నీరు వచ్చి సుడులు తిరగడం డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం‌మ్‌లు దెబ్బతిన్నాయి’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. పీపీఏ ప్రాజెక్టు విషయంలో ముందుకు వద్దు. బాధ్యత ఫిక్స్ చేయలేం అన్నారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారం చేశారు. దీంతో 6 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. ఒక వ్యక్తి అవగాహన లోపం వల్ల జాతికి ఎంత నష్టం కలిగిందో చూశాం” అంటూ చంద్రబాబు విమర్శించారు. 

తాము, బీజేపీ, జనసేనలు కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేపడతాం అని చెప్పామని,  అందులో భాగంగా తిరిగి పోలవరం ప్రాజెక్టును ట్రాక్‌లో పెట్టాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.