మంత్రుల పనితీరుపై చంద్రబాబు 100 రోజులకు `ప్రోగ్రెస్ రిపోర్ట్’

మంత్రుల పనితీరుపై చంద్రబాబు 100 రోజులకు `ప్రోగ్రెస్ రిపోర్ట్’
ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత మంత్రుల అందరి పనితీరుపై `ప్రోగ్రెస్ రిపోర్ట్’ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అధికారులను బైటకు పంపి, మంత్రులతో రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మంత్రుల పనితీరును ప్రస్తావించారు.  జనసేన మంత్రుల రిపోర్టును పవన్ కల్యాణ్‌కు అందిస్తామని సీఎం తెలిపారు. 
 
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ప్రవర్తన మితీమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని ఆయన స్పష్టం చేశారు. ఒకరిద్దరు తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకుపోయి, నేతల తీరే హైలెట్ అవుతోందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 
 
మాయ చేయడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టింది మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని రివర్స్ టెండరింగ్‌కు అర్థం ఏముందని ప్రశ్నించారు. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని మంత్రులు సూచించారు. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేయించుకోవడానికే జగన్ జ్యుడిషియల్ ప్రివ్యూను తీసుకొచ్చారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవస్థ రద్దు చేసేలా చూడాలని కోరారు.

ఇసుక పాలసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. సమయ పరిమితులు లేకుండా ఇసుక సరఫరాకు అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుందని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

రేషన్ వాహనాలను రద్దు చేయాలన్న నిర్ణయంపై మంత్రివర్గంలో చర్చ జరగ్గా వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు అధికారులు చెప్పారు. రేషన్ వాహనాలతో ఎలాంటి ఉపయోగం లేదని పయ్యావుల కేశవ్ చెప్పగా బ్యాంక్ లింకేజీతో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు తెలిపారు.

 
 ఫ్రీ-హోల్డ్‌లోకి వెళ్లిన భూముల్లో సత్యసాయి జిల్లాలోనే అత్యధికంగా 5 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని చర్చ జరిగింది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.