మలయాళ చిత్ర పరిశ్రమలో 17 మందిపై లైంగిక వేధింపు కేసులు

మలయాళ చిత్ర పరిశ్రమలో 17 మందిపై లైంగిక వేధింపు కేసులు

తనపై 2016లో లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక నటి ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని మలయాళ నటుడు సిద్దిఖ్‌పై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. మ్యూజియం పోలీసు స్టేషన్‌లో నటుడు సిద్దిఖ్‌పై ఐపిసిలోని సెక్షన్ 376, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి బుధవారం తెలిపారు. 

ఈ ఘటన 2016లో జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐపిసి కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటపడిన దరిమిలా వివిధ దర్శకులు, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మలయాళ సినీ ప్రముఖుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకావడం ఇది రెండవసారి.

ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఒక్కొక్కరు తమకు జరిగిన భయానక అనుభవాల్ని బయటపెడుతున్నారు.  తాజాగా నటి సోనియా మల్హార్ తానూ గతంలో వేధింపులకు గురైనట్టు తెలిపారు. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని ఆమె ఆరోపించారు. 

మీటూ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.  ప్రముఖ నటుడు జయసూర్యతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ముఖేశ్‌, రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మిను మునీర్ ఇటీవల ఆరోపణలు చేశారు. 

అయితే ఈ విషయం బయటపెట్టిన దగ్గరి నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.  2013లో ఓ సినిమా చిత్రీకరణ కోసం పనిచేస్తున్నప్పుడు టాయిలెట్‌కు వెళ్లి బయటకు వచ్చిన సమయంలో జయసూర్య తనను వెనక నుంచి హత్తుకున్నారని మిను మునీర్‌ ఆరోపించారు. 

అక్కడితో ఆగకుండా తనకు ముద్దు పెట్టారని పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, అక్కడి నుంచి పారిపోయానని తెలిపారు. ఆ తర్వాత తనతో ఉంటే మరిన్ని సినిమాలు ఇప్పిస్తానని ఆయన పేర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. మలయాళ సినీ కళాకారుల సంఘం- అమ్మ సభ్యత్వం పొందేందుకు సహాయం చేస్తాననే నెపంతో అమ్మ మాజీ కార్యదర్శి ఇడవెల బాబు తనను ఆయన ఫ్లాట్‌కి పిలిచి శారీరకంగా వేధించారని ఆరోపించారు.

అమ్మలో చేరడానికి అధికార సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ సహాయం కోరగా తన నుంచి ఏదో ఆశించాలని చూశారని ఆరోపించారు. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్‌ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయని వాపోయారు. ఈ పరిణామాలతో తాను చెన్నైకి వెళ్లిపోయినప్పుడు ఏమైందని ఎవరూ అడగలేదని వాపోయారు.

హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు ఖుష్బూ స్పందిస్తూ ప్రతి రంగంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ  ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్న ఆమె, వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకున్నారు.

 
 వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్‌ ఎంతో ఉపయోగపడిందని ఆమె చెప్పారు. కెరీర్‌లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయని ఆమె  పేర్కొన్నారు.