
కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానంపై భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25 శాతం మేర తగ్గనున్నాయి.
దీంతోపాటు స్టడీ పర్మిట్లూ పరిమితమవుతాయి. అందువల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా భారతీయులు బంగారు భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడాకు వెళ్లడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే, ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమను వెనక్కి పంపుతారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీనితో వాళ్లు ఆందోళనలకు దిగుతున్నారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
గత 3 నెలలుగా ఈ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆందోళనలే ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాల్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వర్క్ పర్మిట్లు ముగుస్తాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని నవ జవాన్ సపోర్ట్ నెట్‌వర్క్ అనే విద్యార్థి సంఘం చెబుతోంది.
అయితే, వలసలపై తాము సానుకూలంగానే ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అలాగే కెనడాకు వచ్చే ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘మేం ముందుకు సాగడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. వలసలకు కెనడా ఎప్పటికీ స్వర్గధామంగానే ఉండాలనేది మా ఆకాంక్ష’ అని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లు, ఉద్యోగ సమస్యలను విస్తృత కోణంలో చూడకుండా, తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపించింది. వాటికి పరిష్కారాలను వెతక్కుండా వలసలు, అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించింది. కెనడా 2023లో అత్యధికంగా 1,83,820 విదేశీ తాత్కాలిక వర్క్ పర్మిట్లను జారీ చేసింది. 2019తో పోలిస్తే అది 88 శాతం అధికం.
అయితే కొత్త విధానంతో ఈ ఏడాది ఈ పర్మిట్లకు భారీగా కోత పడింది. కొత్త విధానం ప్రకారం, నిరుద్యోగిత రేటు 6 శాతం కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ, ఆరోగ్య రంగాలను దీని నుంచి మినహాయించారు. ఈ రంగాల్లో ఉద్యోగుల కొరత ఉండటమే దీనికి కారణం.
వచ్చే మూడేళ్లలో మొత్తం దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు చర్యలు తీసుకుంటోంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు