
* 6 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వరుసగా మూడోరోజైన మంగళవారం కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది.
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు ప్రధాన డ్యామ్‌లు, నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. చాలా నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పంచమహల్, నవ్సారి, వల్సాడ్, వడోదర, భరూచ్, ఖేడా, గాంధీనగర్, బోటాడ్, ఆరావళి జిల్లాల్లో నదులు, డ్యామ్‌ల్లో నీటి మట్టం భారీగా పెరిగి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది.
దీంతో ముందు జాగ్రత్త చర్యగా వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకూ 6 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పంచమహల్‌లో దాదాపు 2,000 మందిని తరలించగా, వడోదరలో 1,000, నవ్సారిలో 1,200 మంది, వల్సాద్‌లో 800 మందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఈ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గాంధీనగర్, ఖేడా, వడోదర జిల్లాల్లో గోడ కూలిన ఘటనల్లో నలుగురు మృతి చెందగా.. ఆనంద్ జిల్లాలో చెట్టు కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బుధ, గురువారాల్లోనూ సౌరాష్ట్ర – కచ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఇవాళ కురిసిన తాజా వర్షాల కారణంగా రాజ్‌కోట్ నగరంలో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, అండర్‌పాస్‌లు పూర్తిగా జలమయమయ్యాయి. ఒక్క రాజ్‌కోట్ నగరంలో ఉదయం 6 గంటల నుంచి నాలుగు గంటల వ్యవధిలోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
24 గంటల వ్యవధిలో మొత్తం 251 తాలూకాల్లో కనీసం 24 తాలూకాల్లో 200 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో 91 తాలూకాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. అత్యధికంగా మోర్బి జిల్లాలోని టంకారా తాలూకాలో 347 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
మోర్వ హడాఫ్‌లో 346 మి.మీ, ఖేడాలోని నడియాడ్‌లో 327 మి.మీ, ఆనంద్‌లోని బోర్సాద్‌లో 318 మి.మీ, వడోదర తాలూకాలో 316, ఆనంద్ తాలూకాలో 314 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్