హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై కేరళ ప్రత్యేక కమిటీ

హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై కేరళ ప్రత్యేక కమిటీ

మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది.ఈ క్రమంలోనే పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ నటీమణులు ఆరోపించడం సంచలనం రేపుతోంది. దీంతో కేరళ ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ నటి రేవతి సంపత్‌ ఆరోపించారు. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు, కేరళ స్టేట్‌ చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్ధిఖీ, రంజిత్‌లు వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజాగా వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్‌ కుమార్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. 

మాలీవుడ్‌లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని తాజా నివేదిక ఎత్తిచూపింది. కొంతమంది మత్తులో జోగుతూ బాధిత మహిళల రూమ్‌ తలుపు తట్టేవారని.. వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది. భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది.