రూ. 60,000 కోట్లతో డిసెంబర్ 1 నుండి అమరావతి పనులు

రూ. 60,000 కోట్లతో డిసెంబర్ 1 నుండి అమరావతి పనులు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబరు 1న ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక-పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి రూ.60 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని చెబుతూ  ప్రపంచ స్థాయిలో నంబర్‌ వన్‌ సిటీగా తీర్చిదిద్దుతామని,  నాలుగేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 
 
శనివారం కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్‌ సౌత్‌కాన్‌-2024 సమావేశంలో ఆయన, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి మాట్లాడుతూ  వచ్చే నెల మొదటి వారంలో ఐఐటీ నిపుణుల కమిటీ నివేదిక అందుతుందని నారాయణ చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. పాత టెండర్లను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
అమరావతి నిర్మాణం అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతూ  గతంలో 41వేల కోట్లకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. అమరావతితో పాటు సమాంతరంగా 26 జిల్లాలనూ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధికి క్రెడాయ్‌ సహకరించాలని మంత్రి కోరారు. 
 
బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని, సింగిల్‌ విండోలో ఇవ్వడానికి కృషిచేస్తామని, ఆన్‌లైన్‌ వ్యవస్థను సరళీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
 
విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అదృష్టమని కేంద్ర మంత్రి  శ్రీనివాస వర్మ తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ రెండు నెలల్లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు 13 మంది కేంద్ర మంత్రులను అనేక సార్లు కలిశారని ఆయన గుర్తు చేశారు. 
 
రాజధాని అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరిన వెంటనే కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం కేంద్రం ప్రకటించిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన నిర్మాణ రంగ సంస్థలు రాష్ట్రానికి తిరిగి రావాలని వర్మ పిలుపిచ్చారు. తమ సమస్యలపై క్రెడాయ్‌ ప్రతినిధులు నిర్మలాసీతారామన్‌తో పాటు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.