భారత సరిహద్దుల్లో బంగ్లా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్

భారత సరిహద్దుల్లో బంగ్లా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్

భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్‌ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు.

కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగష్టు 8న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణస్వీకారం చేశారు. 

అనంతరం హసీనా ప్రభుత్వంలో పనిచేసిన మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దీపూ మోని, పలువురు ఉన్నతాధికారులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

కాగా న్యాయశాఖ మాజీ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మా ఢాకా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టు దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.

ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది. హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బీఎన్‌పీ సెక్రెటరీ జనరల్‌ మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగీర్‌ డిమాండ్‌ చేశారు.