
జమ్మూకశ్మీర్‌లో సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు సోపోర్ పోలీసులు, 32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు. మిగతా వారి జాడ కోసం బలగాలు అన్వేషిస్తున్నాయి. హతమైన ఉగ్రవాది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాదిని గుర్తించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు ముందు భద్రతా బలగాలు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పీవోకే నివాసిని గుర్తించి అరెస్ట్ చేశాయి.
సదరు వ్యక్తిని జహీర్ హుస్సేన్‌గా గుర్తించారు. భద్రతా బలగాలు అతన్ని పూంచ్‌లో పట్టుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా బలగాలను మోహరించింది. ఇప్పటి వరకు దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు.
శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపోరా, అనంత్‌నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కంపెనీలను మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ లోయలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమా బాల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో సహా 298 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్