11 బిల్లులను వెనక్కి పంపిన కర్ణాటక గవర్నర్

11 బిల్లులను వెనక్కి పంపిన కర్ణాటక గవర్నర్

కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం పంపిన 11 బిల్లులను గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ వెనక్కి పంపారు. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇటీవల అనుమతి ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరింత వివరణ కోరుతూ 11 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపడం గమనార్హం.

అందులో మూడు బిల్లులను గవర్నర్ రెండోసారి వెనక్కి పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2023, కర్ణాటక హిందూ మత సంస్థలు, స్వచ్ఛంద ధర్మాదాయ సవరణ బిల్లు 2023, కర్ణాటక టౌన్ అండ్ రూరల్ ప్లానింగ్ సవరణ బిల్లులను గవర్నర్ రెండోసారి వెనక్కి పంపారు. 

వీటితోపాటు మరికొన్ని బిల్లులను గవర్నర్ వెనక్కి తిప్పి పంపారు. వాటిపై తమకు మరింత సమాచారం కావాలని కోరారు. గవర్నర్ 11 బిల్లులను తిప్పి పంపడంపై కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. తమ ప్రభుత్వానికి గవర్నర్ వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైందని హోంమంత్రి జి.పరమేశ్వర ఆరోపించారు.  రెండు బిల్లులపై స్పష్టత అడిగారే తప్ప మిగిలిన బిల్లులు గవర్నర్ ఎందుకు వెనక్కి పంపారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. 

“సాధారణ బిల్లులను కూడా గవర్నర్ వెనక్కి పంపారు. గవర్నర్‌, ప్రభుత్వం మధ్య సమన్వయం లేకుంటే ఇలానే ఉంటుంది. సహజంగానే గవర్నర్‌కు మా ప్రభుత్వంపై విశ్వాసం లేదు. ఈ ఘటనతో ఇది మరింత స్పష్టమైంది” అని ఆయన విమర్శించారు.

“బీజేపీ ఎమ్మెల్యేల మాటలు విని గవర్నర్ బిల్లులను వెనక్కి పంపారు. బీజేపీ మాట వింటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఎందుకుండాలి? బిల్లుల్లో ఏదైనా స్పష్టత అడిగితే ఇస్తాం. కానీ అలా చేయకుండా అన్ని బిల్లులు వెనక్కి పంపారు. గవర్నర్‌కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోందా అని ప్రశ్నించగా, తాము చూస్తూ ఊరుకోబోమని డీకే స్పష్టం చేశారు.

కాగా, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌ పట్ల అవమానం చేసేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిందని, ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా ఆందోళనలు విరమించేది లేదని పరిషత్‌ ప్రతిపక్షనేత చలవాది నారాయణస్వామి స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో  చేపట్టిన నిరసన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.