సౌదీలో ఉద్యోగం చేస్తున్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెమ్ గ్రామానికి చెందిన పోతుగంటి చంద్రశేఖర్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున అత్యవసరంగా భారత్ కు వాపస్ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి గురువారం హైదరాబాద్ లోని విదేశాంగ శాఖ, పిఓఇ (ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్) కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ ఆమె వెంట ఉన్నారు.
చంద్రశేఖర్ జూన్ 24న హైదరాబాద్ లోని ఎస్కే మెడికల్ సెంటర్ (గల్ఫ్ దేశాలు గుర్తించిన వైద్య కేంద్రం)లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. జులై 11 నాడు ఉద్యోగ వీసాపై సౌదీ అరేబియాలోని అల్-బాద్, తాబూక్ కు వెళ్లి ఫ్యామ్కో కంపెనీ నియోమ్ ప్రాజెక్ట్ లో క్లీనింగ్ సూపర్ వైజర్ గా చేరాడు.
టీకా ఇంజెక్షన్ వలన ఇన్ఫెక్షన్ తో కుడి భుజం గాయమై రక్తం కారుతున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మెరుగైన చికిత్స కోసం తనను భారత్ కు పంపించాలని చంద్రశేఖర్ కోరుతున్నాడు. ఈమేరకు తన ఉద్యోగానికి రాజీనామా కూడా సమర్పించాడు. సెప్టిక్ అయి భుజం కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
ఢిల్లీ లోని హెచ్.ఆర్. ఇంటర్నేషనల్ అనే రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా చంద్ర శేఖర్ సౌదీ వెళ్ళాడు. తన కుమారుడిని వాపస్ తెప్పించడంలో ఏజెన్సీ వారు సహకరించాలని తల్లి లక్ష్మి కోరారు. నిర్లక్ష్యంగా టీకా వేసి తన కుమారుడి అనారోగ్యానికి కారకులైన హైదరాబాద్ లోని ఎస్కే మెడికల్ సెంటర్ పై ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ తగిన విచారణ చేయాలని ఆమె కోరారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వలంటీర్ రంజిత్ చిత్తలూరి బృందం చంద్రశేఖర్ కు సహకరిస్తున్నారు.

More Stories
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
సిర్పూర్-యు అడవుల్లో 16 మంది నక్సల్స్ అరెస్ట్,