ప్రపంచవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న మంకీపాక్స్ కేసులపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒకవేళ ఈ వైరస్ రాష్ట్రంలో ప్రవేశిస్తే.. వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే.. గాంధీ ఆస్పత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని కూడా వైద్యారోగ్య శాఖ రెడీ చేసింది. ఈ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది.
గాంధీ ఆస్పత్రిలో 20 పడకలు కేటాయించగా, ఇందులో పురుషులకు పది, మహిళలకు పది బెడ్లు ఏర్పాటు చేసినట్టు వైద్యులు తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో 6 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు మన దేశంలోకి మంకీపాక్స్ ఎంటర్ కాకపోయినా. . అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెప్తున్నారు.
మరోవైపు మంకీపాక్స్ విషయంలో నిర్లక్ష్యం వద్దని ఇప్పటికే అన్ని జిల్లాలను ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ప్రత్యేక వార్డులు, మెడికల్ కిట్‌లు అందుబాటులో ఉంచుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ, ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హఠాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, కాళ్లుచేతులతో పాటు ముఖంపై దద్దుర్లు, దురద, చలి, తీవ్ర అలసట లాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే అధికారులకు తెలియజేయటంతో పాటు.. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ వైరస్.. రక్తం, శరీర ద్రవాలు, చర్మ గాయాలు, శ్వాసకోశ స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుందని వైద్యులు పేర్కొన్నారు.

More Stories
హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి
వీర్ బాల్ దివస్ సందర్భంగా సిఖ్ త్యాగాలకు నివాళులు!
సింగరేణిలో రూ 25 కోట్ల జరిమానా మాఫీకై కుతంత్రం!