ఏపీ చెల్లించిన రుణం రూ 2,547 కోట్లు సర్దుబాటు చేసిన కేంద్రం

ఏపీ చెల్లించిన రుణం రూ 2,547 కోట్లు సర్దుబాటు చేసిన కేంద్రం
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకు కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం చేయూత ఇస్తూ వస్తున్నది. తాజాగా, రాష్ట్ర విభజనకు సంబంధించి  ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ తరఫున చెల్లిస్తూ వచ్చిన అప్పు మొత్తం రూ. 2,547 కోట్ల నిధులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఇప్పుడు ఆ నిధులను తెలంగాణ ఖాతా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సర్దుబాటు చేసింది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన పథకాలకు సంబంధించి తీసుకున్న రుణాలు ఏపీ పేరుతో ఉండడంతో ఏపీ ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తున్నది. ఈ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నా అప్పుల విభజన జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచే వాటి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నిధులను ఎప్పటి నుంచో సర్దుబాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది. 
 
ఈ క్రమంలో కేంద్రం గురువారం రూ. 2,547 కోట్ల నిధులను ఏపీకి సర్దుబాటు చేసింది. అంటే గతంలో తెలంగాణ తరఫున ఏపీ చెల్లించిన అప్పును కేంద్రం తిరిగి జమ చేసింది. ఈ నిధులు ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట అని చెప్పాలి.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నట్లు సమాచారం. తాజాగా బ్రహ్మకుమారీలు 20వ వార్షికోత్సవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

 
విభజన సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు జులై నెలలో హైదరాబాద్‌లో సమావేశమైన పరిష్కారంకోసం అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత ఈ విషయంలో పురోగతి కనిపించడం లేదు.