
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్యెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగానే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా నియామకం పొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ గడువు పూర్తి అయ్యే సమయానికి బొత్స సత్యనారాయణ ఒక్కరే నామపత్రాలు దాఖలు చేశారు. దీంతో పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయనే ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ క్రమంలోనే శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు బుధవారం తన చాంబర్‌లో బొత్స సత్యనారాయణతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఇక ఈ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పోటీ చేయలేదు. దీంతో వైసీపీ తరఫున నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో నిలవడంతో ఆయననే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయనను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్‌ను బొత్స సత్యనారాయణ కలిశారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణను శాసనమండలి పక్షనేతగా నిర్ణయిస్తూ వైసీపీ అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
మరోవైపు మ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రస్తుతానికి వైసీపీది 3 రాజధానుల విధానమేనని తేల్చి చెప్పారు. 3 రాజధానుల విషయంపై తమ పార్టీ విధానం మార్చాలనుకుంటే తమ అధినేత వైఎస్ జగన్‌తో మాట్లాడి చర్చించుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ తమ పార్టీ విధానం మారితే చెబుతామని ఆయన వెల్లడించారు
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పిన బొత్స స్థానిక నేతలు, వైసీపీ నేతలకు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని పేర్కొంటూ ప్రస్తుతానికి కేవలం 75 రోజులు మాత్రమే పూర్తి అయిందని పేర్కొంటూ వారికి కొంత సమయం ఇవ్వాలిగదా అని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపైనే ఢిల్లీలో పోరాడామని బొత్స వెల్లడించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు