
దాదాపు పదేళ్లుగా జోన్ ఏర్పాటు వ్యవహారం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రైల్వే జోన్‌కు శంకుస్థాపన అంటూ వైసీపీ నేతలు హడావుడి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే జోన్ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి శంకుస్థాపన అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరిగింది.
విభజన హామీల్లో ప్రధానమైన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు పడనుంది. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ నిరీక్షణ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు త్వరలో నెరవేరుతుందని తెలిపారు.
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అన్ని రకాల చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటుకు ముహూర్తం నిర్ణయిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు వివరించారు. రైల్వే జోన్‌కు అవసరమైన భూ కేటాయింపు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తుత ఏపీలోని కూటమి ప్రభుత్వం సరి చేసిందని, ఇక రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని మంత్రి తెలిపారు. అతిత్వరలోనే విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలక సిద్ధమవుతామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమి విషయంలో అభ్యంతరాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో వేరేచోట భూమి కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని, భూ కేటాయింపుపై నెలకొన్న వివాదాలు పరిష్కారం అయ్యాయని, జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలిగి పోయాయని చెప్పారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో పురోగతి ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయని చెప్పారు.
మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని వైసిపి ప్రభుత్వం సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది.
తాజాగా రైల్వేశాఖ మంత్రి ప్రకటనతో విశాఖ రైల్వే జోన్‌పై కీలక ప్రకటన వెలువడింది. దశాబ్దాల కాలం నుండి రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్నో వినతులు చేసినప్పటికీ.. అది ఇప్పటికీ నెరవేరబోతోందని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం
తొలి టెస్టులో భారత్ వెస్టిండీస్‌పై ఘన విజయం
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర