పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్న వేళ అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో సహితం చిచ్చు రేపుతోంది. ఈ ఘటన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. పైగా, ముఖ్యమంత్రి స్వయంగా హోమ్, ఆరోగ్య శాఖలను నిర్వహిస్తూ ఉండడంతో పార్టీ నాయకత్వం ఇరకాట పరిస్థితి ఎదుర్కోవలసి వస్తున్నది.
ఈ నెల 9న వెలుగు చూసిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన, అదేసమయంలో ఈ నెల 14న ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనపై సొంత సర్కారు వ్యవహరిస్తున్న తీరును టీఎంసీ నాయకులే విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరికొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ బిజెపి వర్గాల నుండి వస్తుండటం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండటం ఆ పార్టీ నేతలను గందరగోళంకు గురిచేస్తున్నది. పైగా, పార్టీలో మమతా తర్వాత కీలక అధికార కేంద్రమైన ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మౌనం వహిస్తుండటం సహితం విస్మయం కలిగిస్తున్నది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కీలక నాయకుడు కునాల్ ఘోష్ తప్పులు సరిచేసుకోవాల్సిన అవసరం తమపై ఉందని పేర్కొంటూ అభిషేక్ మూగనోము సరికాదని సూచించారు. హత్యాచార ఘటన తర్వాత ఆర్జీ కర్ ఆసుపత్రిపై ఈ నెల 14న జరిగిన దాడిపై అదే రాత్రి అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలి పెట్టరాదని, వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఎక్స్ వేదికగా కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను కోరారు.
విధ్వంసానికి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టరాదని, బాధ్యులను 24గంటల్లోగా అరెస్టు చేయాలని చెప్పారు. అయితే, అభిషేక్ ఆశించింది ఏమీ జరగలేదని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని టీఎంసీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి పార్టీలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది మరికొందరి వాదన.
ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో సరిగా పనిచేయని నాయకులపై వేటు వేయాలని అభిషేక్ కోరారు. దీనిని పార్టీ అధిష్ఠానం సీరియ్‌సగా పరిగణించలేదు. ఈ పరిణామాలతో.. తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందన్న భావనలో బెనర్జీ ఉన్నారని పలువురు నాయకులు భావిస్తున్నారు. పాలనా పరంగా తప్పులు, సీనియర్ నేతల వైఖరి కారణంగానే అభిషేక్ మౌనంగా ఉన్నారని మరికొందరు నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతుండడం గమనార్హం.
మరోవంక, హత్యాచార ఘటనపై అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో దోషులకు ఉరిశిక్ష విధించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని సూచించారు. హత్యాచార ఘటనపై అధికార పార్టీ టీఎంసీలో నేతలు తలోమాట మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
సీనియర్ నేత శంతను సేన్ మాట్లాడుతూ. హత్యాచార ఘటన సీఎంకు తెలియజేయకుండా ఆర్జీకర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తొక్కిపెట్టారని, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. మరో నేత కునాల్ మాత్రం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు చెరిగిపోయేలా మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు చేపట్టరాదని చెప్పారు. టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్‌రాయ్ వైఖరి పార్టీలో మరింత దుమారం రేపింది. ఈ నెల 14న మహిళలు చేపట్టిన ధర్నాలో ఆయన ఒంటరిగా పాల్గొనడంతోపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

More Stories
బెంగాల్ లో 100కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 11 మంది సజీవ దహనం
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?