కోల్‌కతా లైంగిక దాడి, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం

కోల్‌కతా లైంగిక దాడి, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం

కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనున్నది.  ఇంతకుముందు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు.

‘క్రూరత్వంతో మూగబోయిన బాధితులకు ఈ కేసులో న్యాయ వ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని యావత్ దేశం చూస్తోంది. ఇతరులకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన యువ వైద్యురాలి మరణానికి తగిన న్యాయం చేకూర్చాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కాల్ డేటా, చాటింగ్ వివరాలను పరిశీలిస్తోంది. వరుసగా మూడో రోజు ఆదివారం కూడా సందీప్ ఘోష్ ను విచారించింది. ఇప్పటికే ప్రధాన నిందితుడితోపాటు 20 మందిని సీబీఐ అదుపులోకి తీసుకున్నది.

కాగా, తమ కూతురిని వైద్యురాలని చేసేందుకు తామెంతో కష్టపడ్డామని, చివరకు ఆమెను కిరాతకంగా హత్య చేశారని కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ ఆస్పత్రి ఘటనలో బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. దోషిని వీలైనంత త్వరలో అరెస్ట్‌ చేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చినా ఇంతవరకూ ఏం జరగలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారని, అయితే ఈ ఘటనలో పలువురి ప్రమేయం ఉందని తాను భావిస్తున్నా్నని ఆమె చెప్పారు.  ఈ ఘటనకు మొత్తం డిపార్ట్‌మెంట్‌ బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. 

తమ కూతురి హత్యాచార ఘటనపై పెల్లుబుకిన నిరసనను చల్లార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజలు నిరసన చేపట్టకుండా నిరోధించేందుకు ఈరోజు 144 సెక్షన్‌ విధించారని అన్నారు. పోలీసులు తమతో ఏమాత్రం సహకరించడం లేదని, వారు వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

పోస్ట్‌మార్టం నిర్వహించి సత్వరమే మృతదేహాన్ని తొలగించాలనే ఆతృతతో ఉన్నారని మండిపడ్డారు. మరోవైపు తమ కూతురి మృతదేహాన్ని తమకు ఆలస్యంగా చూపించారని, ఆమె వంటిపై పలు గాయాలున్నాయని, ఇది ఆత్మహత్య కాదు హత్యేనని తాను ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు స్పష్టం చేశానని చెప్పారు.