సెప్టెంబర్‌ 23న మోదీ అమెరికా పర్యటన

సెప్టెంబర్‌ 23న మోదీ అమెరికా పర్యటన
వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. యూఎన్‌ తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 26న ఈ సమావేశాల్లో ప్రసంగించనున్నారు. అయితే, అంతకు ముందే మోడీ న్యూయార్క్‌లో పర్యటిస్తారు.

లాంగ్‌ ఐల్యాండ్‌లోని 16 వేల సీట్ల సామర్ధ్యమున్న నాసావు కొలీజియం కమ్యూనిటీ సమావేశానికి మోదీ అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించిన ఆయన ప్రసంగించనున్నారు. సమ్మిట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’తో ప్రారంభమయ్యే సెప్టెంబర్‌ 22 నుండి 28 వరకు ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం ప్రధాని న్యూయార్క్‌ వెళ్లనున్నారు.

సెప్టెంబర్‌ 26న జరిగే జనరల్‌ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. అయితే, నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున, అక్కడి దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని, అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో 2014 సెప్టెంబర్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సభలో మోదీ ప్రసంగించి పదేళ్లు దాటింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే, ప్రతిష్టాత్మకమైన వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్‌ నగరానికి వచ్చారు.

2019లో హ్యూస్టన్‌లోని టెక్సాస్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నిర్వహించిన భారీ కమ్యూనిటీ సమావేశమైన హౌడీ – మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికాలో పర్యటిస్తుండటం విశేషం.