అసోంలో 24 ప్రాంతాల్లో ఉల్ఫా (ఐ) బాంబుల కలకలం

అసోంలో 24 ప్రాంతాల్లో ఉల్ఫా (ఐ) బాంబుల కలకలం
అస్సాం వ్యాప్తంగా 24 ప్రదేశాలలో బాంబులు అమర్చినట్లు నిషిద్ధ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా)(ఇండిపెండెంట్) గురువారం చేసిన హెచ్చరికతో అప్రమత్తమైన భద్రతా దళాలు పేలుడు పదార్థాల కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఉల్ఫా వెల్లడించిన అన్ని ప్రదేశాలకు బాంబు డిస్పోజల్ స్కాడ్లు తరలి వెళ్లాయని, అయితే ఇప్పటి వరకు ఎక్కడా బాంబు కాని పేలుడు పదార్థం కాని లభించినట్లు తెలియరాలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
అయితే..సాంకేతిక వైఫల్యం కారణంగా బాంబులు పేలలేదని మీడియా సంస్థలకు పంపిన ఇమెయిల్‌లో ఉల్ఫా తెలిపింది. 19 బాంబులు అమర్చిన ప్రదేశాల జాబితాను పంపిన ఉల్ఫా మిగిలిన ఐదు ప్రదేశాలను వెల్లడించలేదు. బాంబులను నిర్వీర్యం చేయడంలో ప్రజలు సహకరించాలని ఉల్ఫా కోరింది. అయితే..దీనిపై ఒక సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న ఉల్ఫాలోని ఒక వర్గం ప్రస్తావించిన ప్రదేశాల జాబితాను అన్ని జిల్లాల ఎస్పీలకు పంపామని, ఆయా ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు జరపాలని కోరామని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వ్యతిరేకిస్తూ మయన్మార్‌ కేంద్రంగా పనిచేసే ఉల్ఫా(ఐ), అసోంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు ప్రయత్నించింది. ఈ మేరకు ఉల్ఫా(ఐ) నేత ఇషాన్ అసోమ్ ప్రకటన విడుదల చేశారు. ‘స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మా నిరసనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన బాంబులు పేలలేదు. ముందుగా నిర్ణయించినట్లుగా ఆగస్టు 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు దాడులు జరగాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల బాంబు పేలుళ్లు జరగలేదు’ అని ఇషాన్ అసోమ్ తెలిపారు.

తాము అమర్చిన బాంబులను నిర్వీర్యం చేయాలని ఇషాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఉల్ఫా ఐ ప్రకటన నేపథ్యంలో అసోం పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.  ముఖ్యంగా గువాహటిలోని 8 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలపడం వల్ల పోలీసులు అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ప్రదేశానికి బాంబు డిస్పోజల్ స్కాడ్‌లు, మెటల్ డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్స్‌ను పంపినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు బాంబుల లభ్యతకు సంబంధించి సమాచారం లేదని తెలిపారు. అయితే తమకు బాంబు లాంటి పదార్థం లభించినట్లు నాగావ్, లఖింపూర్, శివసాగర్‌కు చెందిన స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఉల్ఫా పేర్కొన్న 24 ప్రదేశాలలో 8 గువాహటిలోనే ఉన్నాయి. వీటిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మంత్రుల అధికారిక నివాసాలు ఉన్న డిస్‌పూర్‌లోని లాస్ట్ గేట్‌లోని ఖాళీ స్థలం కూడా ఉంది.