తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపీ సర్కారు

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపీ సర్కారు
తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్‌లో ఉంటూ వస్తూనే ఉంది. 
 
ఎప్పుడెప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు. అయితే.. కూటమి సర్కార్ వచ్చిన రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి (తెలంగాణకు) పంపేలా మంగళవారం సాయంత్రం చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
 
మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల బదీలీలపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుముడి వీడిందని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.