బెయిల్‌ను తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే

బెయిల్‌ను తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
చట్టవ్యతిరేక కార్యకలాపాలు.. తదితర ప్రత్యేక చట్టాల కింద జరిగే నేరాలకు  కూడా  బెయిల్‌ నియమం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానాలు తగిన కేసుల్లోనూ బెయిల్‌ను తిరస్కరించడం ప్రారంభిస్తే అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌ ధర్మాసనం పేర్కొంది. 
 
ప్రాసిక్యూషన్‌ ఆరోపణలు చాలా తీవ్రమైనవి అయినా బెయిల్‌ కేసును చట్టం ప్రకారం పరిగణించడం కోర్టు విధి అని పేర్కొంది. బెయిల్ అనేది నియమమని, జైలు నుంచి మినహాయింపు అని తెలిపింది. ఇది ప్రత్యేక చట్టాలకు సైతం వర్తిస్తుందని చెప్పింది. న్యాయస్థానాలు బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్టేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
 
జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేసేందుకు కోర్టు అంగీకరించింది. జలాలుద్దీన్‌ ఖాన్‌పై ఉపా యాక్ట్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అతను నిషేధి సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులకు తన ఇంటిపై అంతస్తును అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు నేరపూరిత కుట్ర, ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు పన్నిన కుట్రలో భాగమయ్యాడని ఎన్‌ఐఏ ఆరోపించింది. 
 
నిందితులు ఫుల్వారీ షరీఫ్‌ (పాట్నా)లోని అహ్మద్‌ ప్యాలెస్‌ను అద్దెకు తీసుకొని వసతి ఏర్పాటు చేసుకున్నారని.. భవనాన్ని హింసాత్మక చర్యలకు, సమావేశాలను నిర్వహించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించినట్లుగా ఆరోపణలున్నాయి. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటన సందర్భంగా అలజడి సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లుగా బిహార్‌ పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత 11 జులై 2022న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.