పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు. గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఘటన జరిగి ఐదు రోజులైనా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ మండిపడింది.
ఈ మేరకు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీప్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను బుధవారం ఉదయం లోగా సీబీఐకి అందజేయాలని ఆదేశించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలి సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది.
వైద్యురాలి మృతి అసహజ మరణమని ఈ నేపథ్యంలో కేసు ఎందుకు నమోదు చేయలేదని పశ్చిమ బెంగాల్‌లోని అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలుత ప్రశ్నించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
ట్రైయినీ వైద్యురాలి మృతి నేపథ్యంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సోషల్ మీడియాలో విమర్శలు అయితే వెల్లువెత్తాయి. దాంతో కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరో కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన ఎలా నియమితులయ్యారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.
అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలలోపు ప్రొ. సందీప్ ఘోష్ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లాలని, లేని పక్షంతో అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ముఖ్యమంత్రి వారం రోజులు గడువు ఇవ్వడం ఏమిటని ఆందోళన చేస్తున్న వైద్యులు ప్రశ్నించారు.
ఈ విచారణతో తాము సంతోషంగా లేమని వారు స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ వ్యవహారంలో న్యాయ విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. అలాగే బాధితురాలి కుటుంబానికి నష్ట పరిహారం భారీగా అందజేయాలని డిమాండ్ చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు