హసీనా ఆశ్రయంతో భారత్ తో బంధం తెగదు

హసీనా ఆశ్రయంతో భారత్ తో బంధం తెగదు

మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండటంపై బంగ్లాదేశ్ అధికారికంగా తొలిసారిగా స్పందించింది. ఆమె భారత్ లో నివాసం ఉండటంతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతినే అవకాశం లేదని విదేశాంగ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహీద్ హుస్సెన్ స్పష్టం చేశారు. అక్కడ ఆమె సుదీర్ఘకాలం ఉంటుందా? తాత్కాలికమా? సంబంధాలపై ప్రభావం పడుతుందా? అనేవి ఊహాజనిత ప్రశ్నలు అవుతాయని ఆయన కొట్టిపారేశారు. 

బంగ్లా వీడి, భారత్ రాక వల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవడం భ్రమే అవుతుందని ఆయన చెప్పారు.  ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పరస్పర అవసరం. ఏదో ఒక కారణంతో వీటిని ఏ పక్షం దెబ్బతీసుకోదని తౌహీద్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. 

ద్వైపాక్షిక మేలు బాగోగులపైనే స్నేహం ఆధారపడి ఉంటుంది. వీటికి విఘాతం ఏర్పడితే మిత్రత్వం చెదిరిపోతుందని విదేశాంగ వ్యవహారాలలో అగ్రస్థాయి సలహాదారుడైన తౌహీద్ చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలుగా అంతా సవ్యరీతిలోనే వ్యవహారం ఉంటుందని తెలిపారు. తమకు సంబంధించినంత వరకూ భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.

 సోమవారమే ఈ ప్రతినిధి ఢాకాలోని పలువురు విదేశీ దౌత్య ప్రతినిధులకు దేశ పరిస్థితిని వివరించారు. అంతా అదుపులో ఉందని తెలిపారు. ఈ క్రమంలో సహకరించాలని కోరారు. దౌత్యవేత్తలలో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ కూడా ఉన్నారు. మైనార్టీలు ప్రత్యేకించి హిందువుల భద్రత గురించి వర్మ తమ స్పందన తెలిపినట్లు వెల్లడైంది.

ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్‌ యూనస్‌, ఆ దేశంలో విద్యార్థుల నిరసనలపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని షేక్‌ హసీనాను రాకాసితో పోల్చారు. ‘విద్యార్థులు దేశంలో తెచ్చిన విప్లవంతో రాకాసిని పారదోలారు. మీరు (విద్యార్థులు) సాధించింది అసమాన్యమైంది. మీరంటే నాకెంతో గౌరవం. అందుకే మీ ఆదేశాలను పాటించా’అని యూనస్‌ చెప్పారు. మరోవైపు, దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.