కోల్‌కతాకు ఎన్‌సిడబ్లు బృందం

కోల్‌కతాకు ఎన్‌సిడబ్లు బృందం
మహిళా డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) నుంచి ఇద్దరు సభ్యుల బృందం సోమవారం కోల్‌కతా చేరుకున్నది. డెలినా ఖోంగ్‌దుప్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బృందం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులతో మాట్లాడేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్‌శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది.
 
 ‘ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. ఇటీవలి కాలంలో అత్యంత హీనమైన నేరాల్లో ఒకటి. ఇటువంటి ఘటనలు పశ్చిమ బెం గాల్‌లో జరుగుతున్నాయి. మేము పోలీస్ అధికారులను క లుసుకోనున్నాం,హతురాలి తల్లిదండ్రులను కూడా కలుసు కుంటాం. నేరం జరిగిన ఆసుపత్రికి ఆ తరువాత వెళతామ’ ని ఖోంగ్‌దుప్ విమానాశ్రయంలో విలేకరులతో చెప్పారు.

ఆర్‌బి కార్ ఆసుపత్రి డాక్టర్ హత్య కేసును పోలీసులు ఆదివారం (18) నాటికి పరిష్కరించని పక్షంలో హత్య దర్యాప్తు బాధ్యతను సిబిఐకి తన ప్రభుత్వం అప్పగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ కేసు ను విచారించాలని తాను కోరుకుంటున్నట్లు కూడా మమ త తెలియజేశారు.

 ‘పోలీసులు దీనిని ఆదివారం నాటికి పరిష్కరించలేకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తాం. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ విజయం రేటు చాలా తక్కువగా ఉంది’ అని మమత కోల్‌కతాలో దివంగత డాక్టర్ నివాసం సందర్శన అనంతరం విలేకరులతో చెప్పారు.

ఇది ఇలా ఉండగా, ఆ మహిళా డాక్టర్ హత్యాచారంపై సిబిఐ దర్యా ప్తు కోరుతున్న కనీసం మూడు పిల్‌లను కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించనున్నది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి బదలాయించాలని కోరుతూ కనీసం మూడు పిల్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ముందు దాఖలయ్యాయి. 

పిల్‌లను, దీనికి సంబంధించిన ఏవైనా ఇతర పిటిషన్లను మంగళవారం విచారణకు చేపడతామని బెంచ్ తెలియజేసింది. బెంచ్‌లో న్యాయమూర్తి హిరణ్మయ్ భట్టాచార్య కూడా ఉన్నారు. మహిళా డాక్టర్ మృతదేహం ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో శుక్రవారం కనిపించింది. హత్యకు ముందు ఆమెపై లైంగిక అత్యాచారం జరిగిందని ప్రాథమిక అటా ప్సీ నివేదిక సూచించింది. ఈ హత్య సందర్భంగా ఒక వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.

ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీపై హత్యాచారం కేసు పరిష్కారానికి ఏడు రోజుల గడువును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు ఇచ్చారని కోల్‌కతాలో ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ప్రశ్నించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 

ఈ కేసుపై పారదర్శక దర్యాప్తునకు మమత వాగ్దానం చేసినప్పటికీ దర్యాప్తులో జాప్యాన్ని నిరసనకారులు విమర్శించారు. న్యాయ విచారణ జరిపించాలని, దోషులకు మరణ శిక్ష విధించాలని, బాధితురాలి కుటుంబానికి సముచిత నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు. దర్యాప్తు గురించి వినవస్తున్న వదంతుల విషయమై కోల్‌కతా పోలీసులు క్షమాపణ చెప్పాలని,

ఆసుపత్రి సీనియర్ అధికారులను అందరినీ తొలగించాలని, వారికి వేరే చోట బాధ్యతలు అప్పగించరాదని కూడా వారు కోరారు. పోలీసులు ఆదిలో దీనిని ఆత్మహత్యగా అనుమానించారు. కానీ ఆ తరువాత తమ వైఖరి మార్చుకున్నారు.