వరుసగా 11వ సారి మోదీ జాతీయ పతాకం ఆవిష్కరణ

వరుసగా 11వ సారి మోదీ జాతీయ పతాకం ఆవిష్కరణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. తద్వారా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు.

ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానుల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు. అలాగే ఆయన కుమార్తె, ఇందిరాగాంధీ మొత్తం 16 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రధానిగా జాతినుద్దేశించి మాట్లాడారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు వరుసగా 11 సార్లు ఆమె ఎర్రకోటపై నుంచి ప్రధానిగా ప్రసంగించారు. 

అలాగే 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్ వరకు ప్రధానిగా మరోమారు అదే ఎర్రకోటపై నుంచి ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇక యూపీఏ హయాంలో ప్రధానిగా మనోహ్మన్ సింగ్ పని చేశారు. ఆయన సైతం వరుసగా 10 సార్లు మాత్రమే ఆగస్ట్ 15వ తేదీన ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.

మరోవైపు ఈ వేడుకలకు 18 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా. పేదలు, మహిళలు, యువత, రైతులను ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఆహ్వానితుల జాబితాను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కూడా ఈ వేడుకలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నారు.