దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ.10 వేలు

దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ.10 వేలు
రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రాష్ట్ర సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేబడుతూ దేవాలయాలలో ధూపదీప నైవేద్యాల ఆర్థిక సాయాన్ని రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 
 
ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు ఆర్థికసాయం పెంచుతామని, దీంతో దేవదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. అలాగే సీజీఎఫ్‌ కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 27,127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాల భూమి ఉందని చెబుతూ దేవాలయాల భూములు పరిశీలించి, ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు.

తిరుమల క్షేత్రం నుంచే దేవదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకని, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి పునరుద్దరిస్తామని చెప్పా రు. 

గత ప్రభుత్వం తిరుమల నుంచి అరసవల్లి వరకు దేవాలయాల భూములు అన్యాక్రాంతం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. 

నెల్లూరు జిల్లాలో రెండు దేవాలయాల్లో పొరపాట్లు జరిగినట్లు గుర్తించి ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. వారిపై విచారణ కొనసాగుతోందని చెబుతూ తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొన్ని ఆలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు చెప్పారు.